ఫేస్‌బుక్‌కి మరో సవాల్, సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్కుట్ హల్లో..
మీకు ఆర్కుట్ గుర్తుందా?ఫేస్‌బుక్ రాకముందు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన దిగ్గజం. సోషల్ మీడియా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఆర్కుట్. 2004లో గూగుల్ నుంచి వచ్చిన ఆర్కుట్ సుమారు దశాబ్దకాలం పాటు తిరుగులేని సామాజిక మాధ్యమ వేదికగా యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటివి రావడంతో ఆర్కుట్ క్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. దీంతో కంపెనీ 2014 సెప్టెంబరు 30తో పూర్తిగా ఆర్కుట్ సేవలను నిలిపివేసింది. కాగా మళ్లీ తన పునర్ వైభవాన్ని అందుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా హల్లో పేరుతో సరికొత్తగా సోషల్ మీడియాలోకి దూసుకొస్తోంది.
ఫేస్‌బుక్ డేటా దుర్వినియోగంపై కుదేల్ అవుతున్న నేపధ్యంలో గూగుల్ మాజీ ఉద్యోగి, ఆర్కుట్ వ్యవస్థాపకుడు బయూకాక్‌టెన్ ‘హలో' పేరుతో మరో సామాజిక మాధ్యమ వేదికను భారత్‌లో ప్రారంభించారు. ముఖ్యంగా నేటి మొబైల్ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘హలో'ను తీసుకొచ్చారు.
మీ చుట్టు పక్కల ఉన్న వారిని మీ అభిరుచులకు అనుగుణంగా దగ్గర చేసే, సానుకూలమైన సామాజిక అనుసంధాన వేదిక ‘హలో'. వాస్తవ ప్రపంచంలోని వారిని కలిపేలా ‘హలో'ను తీర్చిదిద్దాం. ఈ సామాజిక మాధ్యమ వేదిక ఇష్టం(లైక్)పై కాకుండా, ప్రేమ(లవ్)పై నిర్మించాం. భారత్‌కు ‘హలో' చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది' అని ‘హలో' సీఈవో బయూకాక్‌టెన్ అన్నారు.
కాగా శాన్‌ఫ్రాన్సికో వేదికగా ‘హలో' కార్యకలాపాలను నిర్వహించనుంది. ఇప్పటికే బ్రెజిల్‌లో అందుబాటులోకి వచ్చిన ‘హలో' ఇప్పటికే మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. భారత్‌లో గత కొన్ని నెలలుగా బీటా వెర్షన్‌ను పరీక్షిస్తున్నారు.
ప్రతి నెలా 320 గంటలపాటు యూజర్లు ‘హలో'లోను వినియోగిస్తున్నారని ఈ పరీక్ లో భాగంగా గుర్తించారు. ప్రస్తుతం ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. వినియోగదారుల సమాచార ప్రైవసీ, భద్రతపై విఫలమవ్వడంపై ఫేస్‌బుక్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్కుట్ హల్లో యూజర్లను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం చౌర్యానికి గురైందన్న వార్తలతో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అందరికీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. 8.7కోట్ల మంది వినియోగదారుల సమాచారం అక్రమంగా ఉపయోగించుకోగా, అందులో 5.62లక్షల మంది భారతీయులు ఉన్నారు.
Comments
Post a Comment